Sunday, December 26, 2010

అమ్మ కడుపు చల్లగా...

Following is a short play focusing on farmer deaths and farmer suicides. It intends to instill a sense of boldness to face adverse situations and take necessary precautions..

This is how the play goes...

A young woman farmer, Saalamma goes to see her friend Narasamma on her return from her native place. Saalamma narrates with enthusiasm how Venkatesh performed the wedding of his daughter with great pomp after he reaped good benefits from his cotton crop. Saalamma feels bad that she had not gone for cotton crop that year because Narasimham, Narasamma's husband has advised them not to venture for any cash intensive crops.

Narasimham reiterates the need to avoid any possible risk and urges her to adopt low external input way of farming. He alerts Saalamma to the potential dangers of going in for capital intensive agriculture. Narasamma advises her to concentrate on the upbringing of her children, plant more diversity for family's nutrition. She asks Saalamma not to be over-concerned about the education of her children. She emphasizes the need for skill development and suggests that she, together with her children could start some income generation activities to support the income from their farm.

Saalamma is convinced about the ills of taking risks but is skeptical if her husband would heed her advice. Narasammaa retorts with ire saying that men are ignoring their words of caution and venturing into risky businesses; and taking to alcoholism and losing lives when their aspirations and dreams doom.

During the conversation Narasamma tells how her relatives lost everything they had, due to floods that year. Narasimham puts the problem in perspective, bringing in the larger picture of climatic change, species extinction and potential natural disasters. He warns them to be prepared to face any kind of situation, and make every effort, such as crop diversification, crop insurance, life insurance, to guard against risks. The play concludes with the three becoming poised to face the year 2011, wishing for happiness and peace.


సాలమ్మ: నరసమ్మత్తా...ఓ నరసమ్మత్తా.. ...నరసమ్మత్త..ఇంకా ఊర్నించి రానట్టుగా ఉందే.
నరసమ్మ: ఎవరూ సాలమ్మా…రా...
సాలమ్మ: ఇంకా ఊర్నించి వచ్చినావో ..లేదో అనుకుంటుండా ...ఇదిగో నరసమ్మత్తా...నువ్వు ఊరిలో లేకపోతివి గానీ ...ఆ ఎంకటేశు లేడూ ..కూతురి పెళ్లి ఎంత బాగా చేసినాడనుకున్నావ్..
నరసమ్మ: అవునా... మంచిది..
సాలమ్మ: ఈ సంవత్సరం ఆ ఎంకటేశుకి పత్తిలో బాగా కలిసొచ్చినాదంట...దెబ్బకి ..దశ తిరిగిపోయిందనుకో..
నరసింహం: తిరిగిపోద్ది..తిరిగిపోద్ది...ఆడికేం...ఆడు యాపారస్తుడూ...పెట్టుబడి పెట్టాగలడు...అదును, పదునూ చూసి సరుకు అమ్మాగలడు..
సాలమ్మ: నరిసిమ్మావా ..నువ్వాపకుండా ..ఉంటే మేమూ..పత్తే ఏసేటోల్లం. ఎంకటేశు కూతురి పెళ్ళికి బంగారు నాంతాడు...ఏస్కోని పోయేదాన్ని...ఆ..
నరసింహం: బంగారు నాంతాడు...ఏస్కోని నువ్వు పొయ్యేదానివో...లేక...ఆడే పోయి..నీ..తాడు..తెగేదో ...ఎవురికి ఎరుక?
నరసమ్మ:..ఏందయ్యా...ఆ మాటలు..అదేదో తెలియక అన్నాది...మనం ఏం సెప్పినా ..దాని మంచి కోసమే కందా...
నరసింహం: అది అట్టనుకుంటే కదా...మనవల్ల నష్టపోయినామంటే ..నాకు సిర్రెత్తుకొచ్చినాది.
సాలమ్మ: మాకున్నది ఈ పోలమే గందా మావా..ఎదుగూ..బొదుగూ..లేక...ఆ..జొన్నలూ, శెనగలే ఏసుకోవాలంటావా ..
నరసింహం: మీకు ఆధారం ఈ పొలమొక్కటే కందా.. అందుకే ఇంకా జాగ్రత్తగా ఉండాల.. ఎటు పోయి ఎటొచ్చినా.. .మనకు లాభం రాకున్నా సరే నష్టం మాత్రం రాకుండా చూసుకోవాల..అప్పు చేసి ఎవసాయం చేస్తే ...పంట మునిగితే ..ఆ వడ్డీలు పెరిగి మనమూ మునిగినట్టే. అందుకే అంత పెట్టుబడి అవసరం లేని పంటలే ఏసుకోవాల.
నరసమ్మ: అయినా….జొన్నలూ, శనగలూ ఏసుకుంటే తప్పేటంట...ఒక్క జొన్నలూ, శెనగ లేందీ..రాగులూ ..కందులూ గూడ..ఏసుకో..నాలుగు..కోళ్ళూ ..నాలుగు మేకలూ కూడ పెంచుకో...ఇయ్యన్నీ ఇంటికీ..వంటికీ మంచియి.
సాలమ్మ: ఇంటికీ ..వంటికీ మంచిదైతే సరిపోద్దేటి. ఇయ్యాల రేపు నాలుగు రాళ్ళు సంపాదించకపోతే ఎట్టాగా ...
నరసమ్మ: సాలమ్మా లక్షల గురించి ఆలోచించకుండా ..లక్షణంగా ఉన్నంతలో పిల్లల్ని సక్కంగా సాక్కో ..
సాలమ్మ: అవును నరసమ్మత్తా ...నా ఆశలన్నీ పిల్లలమీన్నే ..ఎట్టాగైనా.. ఈళ్ళని పెద్ద పెద్ద సదువులు సదివించి మంచి కొలువుల్లో సూడాల

నరసమ్మ: ఇదిగో సాలమ్మా..ఎంతసేపూ సదువూ..సదువూ అని ఆళ్ళని సతాయించమాక. అస్తమానూ సదవమంటే ఆల్లకి సదువంటేనే ఇసుగు పుడతాది..ఏదైనా..పనీ పాటా కూడా నేర్పించు..కుట్లో ..అల్లికలో.. వడియాలో, ఒరుగులో ఏదో ఒకటి..నేర్చుకుంటే నీకు సహాయంగా ఉంటారు. మీరందరూ కలిసి ఏ పని చేసుకున్నా అంతో ఇంతో వస్తాది.. ఏన్నీల్లకు చన్నీళ్ళుగా ఆళ్ళ ఫీజులకీ, పుస్తకాలకీ అయినా కలిసోస్తాది.
నరసింహం: ఈ రోజుల్లో సదువంటే మాటలా...ఆళ్ళ సిన్నప్పుడే తాహతుకి మించి సదువుల మీన పైసలు పెట్టి అప్పుల పాలు గావద్దు..అయినా..ఆ ఉద్యోగాలూ అట్టనే ఉండాయి. అంతలో వస్తున్నాయి..అంతలో పోతున్నాయి..మనం పిల్లలకి ముందు ధైర్యం నేర్పించాల, కష్టపడే అలవాటు చేయాల..
సాలమ్మ: అంతేలే మనం చేసేది చెయ్యాల…ఆపైన...ఆ సామి దయ..
నరసింహం: అద్గదీ.. పిల్లలైనా అంతే పంటలైనా అంతే ..మనం చెయ్యవలసినదంతా ..సెయ్యాల..ఆ పైన..ఓ సంవత్సరం మంచిగుంటాది.. ఓ సంవత్సరం ముంచుతాది. మనం ధైర్యంగా నిలబడాల...అంతేగానీ ..బెంబేలు పడి ...ఉసురు తీసుకుంటే ఆ భార్యా బిడ్డలకి దిక్కెవరు..
నరసమ్మ: పంట పొతే పాయె ..మడుసులన్నా దక్కాల కదా..బతికుంటే ...బలుసాకుతినచ్చు అంటారు..కాలమెప్పుడూ ఒక లాగ ఉండదు కందా..
సాలమ్మ: అంతేలే ఓర్పుతో ఉంటే మంచి రోజులు రాక పోతాయా

నరసింహం: ఓర్పు ఒకటీ సరిపోదు సాలమ్మా...నేర్పు కూడా కావాల. మన పంట విషయమే తీసుకో..ముందు మన వాతావరణానికి ఏ పంటలు సరిపోతాయో తెలుసుకోవాల. ఏదో …ఒకటో ..రెండో పంటలు యేసి దేవుడా ..నీదే భారం అని సేతులు ముడుసుకుని కూచోరాదు...వీలైనన్ని రకాల పంటలు వెయ్యాల. ఒకటి ముంచినా వేరొకటి వస్తాది.
సాలమ్మ: ఒక రకం విత్తనాలు కొనడానికే పైసల్లేకపాయే..ఇంక ..ఇన్ని రాకాలేడ్నుంచి తేవాలా..
నరసింహం:..యాడ్నుంచో కాదు సాలమ్మా ..నీ పొలంనుంచే..కాకపొతే ఇంకోరి పొలం లోంచి..నువ్వు దాచిన విత్తనాలు వాల్లకిస్తే ..వాల్ల విత్తనాలు నీకిస్తారు...
సాలమ్మ: మరి మన పొలాల్లో విత్తనాలు పనికొస్తయంటావా?
నరసమ్మ: మన తాత ముత్తాతలంతా అయ్యే ఏసేవారుగా...
సాలమ్మ: ఆ రోజులు వేరు...ఈ రోజులు వేరు.కదా.నరసమ్మత్తా
నరసమ్మ:..అదీ నిజమే అనుకో ..కాకపొతే నువ్వు దాచుకున్న విత్తనాలైతే వెంబడే ఏసుకోవచ్చు..పైగా..విత్తనాలు కొనే ఖర్చు కూడా ఉండదు.
నరసింహం:..అంతే కాదు..మోసపోయి ..పంట మొత్తం పోగొట్టుకునే పెమాదం ఉండదు. అట్టాగే ఎరువులు కూడా అవసరమైన మేరకే ఉపయోగించాల ...పచ్చి రొట్ట పైర్లతో, ఆకెరువుతో, వానపాము ఎరువుతో భూసారాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాల కానీ, అప్పు చేసి ఎరువులను కొనరాదు..
సాలమ్మ: ఎరువులగన్నా కూడా...ఈ పురుగు మందులు కొట్టడానికే చానా పైసలు పోతున్నాయి మామా
నరసింహం:..అంతే కదా మరి..ఎవరో చెప్పారనో..లేదా పంట పోతుందేమోనన్న భయంతోనో ...అవసరమున్నా లేకున్నా..పిచికారీలు చేస్తే ఖర్చు పెరుగుద్ది ...విత్తనం వేసే ముందు తప్పనిసరిగా విత్తన శుద్ది చేసుకుంటే ..చాలా వరకూ మనం పంటను కాపాడు కోవచ్చు.. తరువాత కూడా.. పైరును జాగ్రత్తగా గమనించుకుంటూ ఉంటే - గుడ్డు దశలోనూ, పిల్ల పురుగుల దశలోనూ చేతితో ఏరి పారేసి కొంత వరకూ పంటను కాపాడుకోవచ్చు...పిచికారీ అవసరమైనప్పుడు కూడా.. రసాయనిక పురుగు మందులు కాకుండా...స్థానికంగా లభించే మొక్కల కాషాయాలని వాడుకోవాలి.
సాలమ్మ: అట్టాగే నరిసిమ్మావా..ఈ పాలి మా పొలాన్నీ, పంటలను కూడా ..మా పిల్లల్లాగే ..సక్కగ..సాక్కుంటాలే...కానీ నరిసిమ్మావా..ఎంకటేశుని చూసి మా ఇంటాయన కూడా పత్తి, మిరప పెట్టాలని చూస్తున్నాడు...మనకీ ఆడపిల్లలున్నారు..మనమూ ఆళ్ళ పెళ్ళిళ్ళు ఘనంగా చెయ్యాలని ఒకటే ఇదైపోతున్నాడు..
నరసింహం: కూతుళ్ళకి ఘనంగా పెళ్లి చెయ్యాలన్నఆశ తండ్రికి ఆమాత్రం ఉండదేటి?.. కానీ ఆ ఆశే ..నిరాశగా మారితే ..కష్టం కదా..అందుకే మనం అట్టాంటి పంటల జోలికి పోవడం మంచిది కాదు..
సాలమ్మ: మరి నేను వెయ్యద్దని సెప్తే ఇంటాడో లేదో...

నరసమ్మ: ఈ మొగాళ్ళ మాట ఇంటూ కూర్చుంటే అయినట్టే. ముందంతా ..నీకేం తెల్దు...నీకేం తెల్దంటూ...ఎవసాయం అని, యాపారం అని ఉన్నదంతా తగలేసి ...ఆ తర్వాత ఏదైనా ఎదురు దెబ్బతింటే ...సారా మత్తులో పడిపోతారు. ఆళ్ళ నుంచి సాయమందుతాది….ఈ డబ్బు చేతికొస్తాది అని ఎదురు చూసి చూసి..అది రాదు అని తెలిసినప్పుడు ..గుండాగి పోవడమో ...లేదా బలవంతంగా ప్రాణాలు తీసుకోవడమో జరుగుతుంది. అప్పుడు ఆ ఉన్న అండ కూడా పోయి ఎటూకాని పిల్లలతో మనమే అవస్థ పడాల.
సాలమ్మ: హమ్మో ఇనదానికే భయమేస్తావుందత్తా ... అట్టాగైతే నాకు నాపిల్లలకి దిక్కెవరు దేవుడో..
నరసింహం:..ఇదిగో మీరిట్టా ..బెంబేలు పడతారనే ..ఆళ్ళు మీకు ఏ సంగతీ చెప్పరు..
నరసమ్మ: ఆ..ఆ..సెప్పా పెట్టకుండా..సచ్చిపోవడం మాత్రం బాగుందేటి ... ఏం చేస్తాం సాలమ్మా చాదస్తం మొగుడు సెపితే ఇనడు అన్నట్టు...మనమే పిల్లలకి చెప్పినట్టు మెల్లగా నచ్చచెప్పుకుంటూ పోవాల. మన చేతిలో ఉన్నంతవరకూ కష్టపడి చేసుకుంటూ పొతే ..కొన్ని దినాలకు ఆల్లే అర్ధం చేసుకుంటారు..
సాలమ్మ: మంచి మాట సెప్పినావ్ నరసమ్మత్తా....అట్టాగే సేద్దాంలే ...ఊర్లో అంతా బాగున్నారా..
నరసమ్మ: ఏం బాగులే సాలమ్మా ..ఈ సంవచ్చరం వచ్చిన వరదలకి మావోల్లంతా బాగా దెబ్బతిన్నారు...ఎవసాయం ఎర్రోని చేతిలో రాయిలాగైపోయినాది….ఎటుపోతుందో తెలియదు .. ఏమైతాదో తెలియదు …అతివృష్టి ..అనావృష్టి.....అనావృష్టికైనా ..ఉపాయాలున్నాయేమో కానీ ..ఈ అతివృష్టి తో అంతా ..తుడిచిపెట్టుకుపోయినాది … ...ఆల్లకేదో ధైర్యం సెప్పాను కానీ ...ఆళ్ళ పరిస్థితి తల్సుకుంటే నాకే గుబులుగా ఉంది...(ఏడుపు)
సాలమ్మ: ఊరుకో నరసమ్మత్తా ...అంతా సర్దుకుంటాదిలే.. ఇది.. .మీ వోల్లొక్కరికే వచ్చిన పరిస్థితి కాదు...ఈ సంవచ్చరం..శానామంది పరిస్థితి ఇట్టానే ఉంది..గవర్నమెంటోల్లు ఏదో సాయం సెయ్యకపోరులే
నరసమ్మ: మారాజుల్లాగా ఉండేవోళ్ళు ...మా రైతులే రాజులం ..మాకు కొలువు లెందుకనేవారు...ఇప్పుడు ఎవసాయం పరిస్థితి చూస్తే ఎవసాయం సెయ్యలని ఎవ్వురూ అనుకోరు...
నరసింహం: ఎవ్వరూ ఎవసాయం సెయ్యకపోతే ..మరి మడుశిలేట్టా బతకాలా .. అందుకే ఇది ఇప్పుడు మన ఒక్కరి సమస్యా కాదు.. . దేశం మొత్తం మీద పరిస్థితి ఇట్టాగే ఉంది…ఒక్క మనదేశంలోనే కాదు..అన్ని దేశాలలో ప్రజలూ ఇట్టాంటి ప్రకృతి వైపరీత్యాల వలన అనేక రకాల కష్టాల పాలౌతున్నారు...మనుషులే కాదు…ఈ వాతావరణంలో వచ్చే పెద్ద పెద్ద మార్పులకు కొన్ని జాతుల మొక్కలూ, జంతువులూ కూడా అంతరిస్తుండాయ్.
సాలమ్మ: అట్టాగా...ఈ ఇపరీతమైన ఎండలకీ ..వానలకీ మడుసులే బతకట్లేదు…ఇంక మొక్కలేం బతుకుతాయ్ ..
నరసింహం: అందుకే మనం ఇట్టాంటి విపత్తులను ఎదుర్కోడానికి సిద్ధంగా ఉండాల...జీవిత భీమాలు, పంట భీమాలు సేయించుకోవాల, దిగుబడి బాగా వచ్చినప్పుడు మంచి ధర చూసి అమ్ముకోవాల ...సరుకు పాడవకుండా ...మంచి గిడ్డంగులను, శీతల రవాణా సౌకర్యాలనూ అందరూ కలిసి ఏర్పాటు చేసుకోవాల…
నరసమ్మ: ముఖ్యంగా లాభాలొచ్చినప్పుడు ఆ డబ్బును అవసరానికి అందివచ్చేలాగా జాగ్రత్త చేసుకోవాలి. అంతేగానీ ఏ వ్యాపారంలోనో ..అధిక వడ్డీకి ఆశపడో పోగొట్టుకోకూడదు. నరసింహం:... ఏది పోయినా ..మనం ధైర్యాన్ని మాత్రం అస్సలు పోగొట్టుకోకూడదు… అయినా కష్టాలు లేనిదెవరికీ..
సాలమ్మ: అంతేలే ...మన సమస్యలే మనకు పాఠాలు నే ర్పిత్తాయ్
నరసింహం: మొత్తానికి ఈ రెండువేల పది మనకు పాఠాలూ, గుణపాఠాలూ సాలానే నేర్పినాది...ఇక రాబోయే సంవచ్చరం మనందరకూ బాగుండాల..
నరసమ్మ: మనందరి కష్టాలూ తీరిపోవాలనీ…
సాలమ్మ: సంతోసంగా, శాంతిగా ఉండాలనీ కోరుకుందాం..

1 comment:

Sugunasri said...

This is the first draft ...
Dr. N. Vijaya, Programme Executive, Akashavani Hyderabad took time reviewed the script thoroughly and offered suggestions for the second draft.

In the revised version, another character was added, dialect changed, and certain words replaced with more colloquial ones.

Edutainment

Edutainment
Crossword puzzles for farmers