This is the second draft - with quick corrections - not to miss the deadline - Dr. Vijaya would have fine tuned it during the recording exercise.
ఈ రూపకం నా 2010 కి కొసమెరుపు 2011 కి తోలి పలుకు...
అమ్మ కడుపు చల్లగా...
సాలమ్మ: నరసమ్మత్తా...ఓ నరసమ్మత్తా.. ...నరసమ్మత్త..ఇంకా ఊర్నించి రానట్టుగా ఉందే.
నరసమ్మ: ఎవరూ సాలమ్మా…రా...
సాలమ్మ: ఇంకా ఊర్నించి వచ్చినావో ..లేదో అనుకుంటుండా ...ఇదిగో నరసమ్మత్తా...నువ్వు ఊరిలో లేకపోతివి గానీ ...ఆ ఎంకటేశు లేడూ ..కూతురి పెళ్లి ఎంత బాగా చేసినాడనుకున్నావ్..
నరసమ్మ: అవునా... మంచిది..
సాలమ్మ: ఈ సంవత్సరం ఆ ఎంకటేశుకి పత్తిలో బాగా కలిసొచ్చినాదంట...దెబ్బకి ..దశ తిరిగిపోయిందనుకో..
నరసింహం: తిరిగిపోద్ది..తిరిగిపోద్ది...ఆడికేం...ఆడు యాపారస్తుడూ...పెట్టుబడి పెట్టాగలడు...అదును, పదునూ చూసి సరుకు అమ్మాగలడు..
సాలమ్మ: నరసింహం మామా..నువ్వాపకుండా ..ఉంటే మేమూ..పత్తే ఏసేటోల్లం. ఎంకటేశు కూతురి పెళ్ళికి బంగారు నాంతాడు...ఏస్కోని పోయేదాన్ని...ఆ..
నరసింహం: బంగారు నాంతాడు...ఏస్కోని పొయ్యేదానివో...లేదో ...ఎవురికి ఎరుక?
నరసమ్మ:.. ఏందయ్యా...ఆ మాటలు....మనం ఏం సెప్పినా ..దాని మంచి కోసమే కందా...
నరసింహం: అది అట్టనుకుంటే కదా...మనవల్ల నష్టపోయినామంటే ..నాకు సిర్రెత్తుకొచ్చినాది.
సాలమ్మ: మాకున్నది ఈ పోలమే గందా మావా..ఎదుగూ..బొదుగూ..లేక...ఆ..జొన్నలూ, శెనగలే ఏసుకోవాలంటావా ..
నరసింహం: మీకు ఆధారం ఈ పొలమొక్కటే కందా.. అందుకే ఇంకా జాగ్రత్తగా ఉండాల.. ఎటు పోయి ఎటొచ్చినా.. .మనకు లాభం రాకున్నా సరే నష్టం మాత్రం రాకుండా చూసుకోవాల..అప్పు చేసి ఎవసాయం చేస్తే ...పంట మునిగితే ..ఆ వడ్డీలు పెరిగి మనమూ మునిగినట్టే. అందుకే అంత పెట్టుబడి అవసరం లేని పంటలే ఏసుకోవాల.
నరసమ్మ: అయినా….జొన్నలూ, శనగలూ ఏసుకుంటే తప్పేటంట...ఒక్క జొన్నలూ, శెనగ లేందీ..రాగులూ ..కందులూ గూడ..ఏసుకో..నాలుగు..కోళ్ళూ ..నాలుగు మేకలూ కూడ పెంచుకో...ఇయ్యన్నీ ఇంటికీ..వంటికీ మంచియి.
సాలమ్మ: ఇంటికీ ..వంటికీ మంచిదైతే సరిపోద్దేటి. ఇయ్యాల రేపు నాలుగు రాళ్ళు సంపాదించకపోతే ఎట్టాగా ...
నరసమ్మ: సాలమ్మా లక్షల గురించి ఆలోచించకుండా ..లక్షణంగా ఉన్నంతలో పిల్లల్ని సక్కంగా సాక్కో ..
సాలమ్మ: అవును నరసమ్మత్తా ...నా ఆశలన్నీ పిల్లలమీన్నే ..ఎట్టాగైనా.. ఈళ్ళని పెద్ద పెద్ద సదువులు సదివించి మంచి కొలువుల్లో సూడాల
నరసమ్మ: ఇదిగో సాలమ్మా..ఎంతసేపూ సదువూ..సదువూ అని ఆళ్ళని సతాయించమాక. అస్తమానూ సదవమంటే ఆల్లకి సదువంటేనే ఇసుగు పుడతాది..ఏదైనా..పనీ పాటా కూడా నేర్పించు..కుట్లో ..అల్లికలో.. వడియాలో, ఒరుగులో ఏదో ఒకటి..నేర్చుకుంటే నీకు సహాయంగా ఉంటారు కదా. మీరందురూ కలిసి ఏ పని చేసుకున్నా అంతో ఇంతో వస్తాది.. ఏన్నీల్లకు చన్నీళ్ళుగా ఆళ్ళ ఫీజులకీ, పుస్తకాలకీ అయినా కలిసోస్తాది.
నరసింహం: ఈ రోజుల్లో సదువంటే మాటలా...ఆళ్ళ సిన్నప్పుడే తాహతుకి మించి సదువుల మీన పైసలు పెట్టి అప్పుల పాలు గావద్దు..అయినా..ఆ ఉద్యోగాలూ అట్టనే ఉండాయి. అంతలో వస్తున్నాయి..అంతలో పోతున్నాయి..మనం పిల్లలకి ముందు ధైర్యం నేర్పించాల, కష్టపడే అలవాటు చేయాల..
సాలమ్మ: అంతేలే మనం చేసేది చెయ్యాల…ఆపైన...ఆ సామి దయ..
నరసింహం: అద్గదీ.. పంటలైనా అంతే ..మనం చెయ్యవలసినదంతా ..సెయ్యాల..ఆ పైన..ఓ సంవత్సరం మంచిగుంటాది.. ఓ సంవత్సరం ముంచుతాది. మనం ధైర్యంగా నిలబడాల...అంతేగానీ ..బెంబేలు పడి ...ఉసురు తీసుకుంటే ఆ భార్యా బిడ్డలకి దిక్కెవరు..
నరసమ్మ: పంట పొతే పాయె ..మడుసులన్నా దక్కాల కదా..బతికుంటే ...బలుసాకుతినచ్చు అంటారు..కాలమెప్పుడూ ఒక లాగ ఉండదు కందా..
సాలమ్మ: అంతేలే ఓర్పుతో ఉంటే మంచి రోజులు రాక పోతాయా
నరసింహం: ఓర్పు ఒకటీ సరిపోదు సాలమ్మా...నేర్పు కూడా కావాల. మన పంట విషయమే తీసుకో..ముందు మన వాతావరణానికి ఏ పంటలు సరిపోతాయో తెలుసుకోవాల. ఏదో …ఒకటో ..రెండో పంటలు యేసి దేవుడా ..నీదే భారం అని సేతులు ముడుసుకుని కూచోరాదు...వీలైనన్ని రకాల పంటలు వెయ్యాల. ఒకటి ముంచినా వేరొకటి వస్తాది.
సాలమ్మ: ఒక రకం విత్తనాలు కొనడానికే పైసల్లేకపాయే..ఇంక ..ఇన్ని రాకాలేడ్నుంచి తేవాలా..
నరసింహం:..యాడ్నుంచో కాదు సాలమ్మా ..నీ పొలంనుంచే..కాకపొతే ఇంకోరి పొలం లోంచి..నువ్వు దాచిన విత్తనాలు వాల్లకిస్తే ..వాల్ల విత్తనాలు నీకిస్తారు... ఎనకటికి మన పెద్దోళ్ళు అట్టాగే సేసే వాళ్ళు కందా..
సాలమ్మ: మరి మన పొలాల్లో విత్తనాలు పనికొస్తయంటావా?
నరసమ్మ: మన తాత ముత్తాతలంతా అయ్యే ఏసేవారుగా...
సాలమ్మ: ఆ రోజులు వేరు...ఈ రోజులు వేరు...నరసమ్మత్తా.. ఇప్పుడేమో ఐబ్రీడ్లు వచ్చినాయ్ కందా
నరసమ్మ:..అదీ నిజమే అనుకో ..కాకపొతే నువ్వు దాచుకున్న విత్తనాలైతే నీ సేతిలోనే ఉంటాయి..అదను తప్పకుండా పంట ఎసుకోవచ్చు....పైగా..విత్తనాలు కొనే ఖర్చు కూడా ఉండదు.
నరసింహం:..అంతే కాదు..మోసపోయి ..పంట మొత్తం పోగొట్టుకునే పెమాదం ఉండదు. అట్టాగే ఎరువులు కూడా అవసరమైన మేరకే ఏసుకోవాల ...పచ్చి రొట్ట పైర్లతో, ఆకెరువుతో, వానపాము ఎరువుతో భూసారాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాల కానీ, అప్పు చేసి ఎరువులు కొనరాదు..
సాలమ్మ: ఎరువులగన్నా కూడా...ఈ పురుగు మందులు కొట్టడానికే చానా పైసలు పోతున్నాయి మామా
నరసింహం:..అంతే కదా మరి..ఎవరో చెప్పారనో..లేదా పంట పోతుందేమోనన్న భయంతోనో ...అవసరమున్నా లేకున్నా..పిచికారీలు చేస్తే ఖర్చు పెరుగుద్ది ...విత్తనం వేసే ముందు తప్పనిసరిగా విత్తన శుద్ది చేసుకుంటే ..చాలా వరకూ మనం పంటను కాపాడు కోవచ్చు.. తరువాత కూడా.. పైరును జాగ్రత్తగా గమనించుకుంటూ ఉంటే - గుడ్డు దశలోనూ, పిల్ల పురుగుల దశలోనూ చేతితో ఏరి పారేసి కొంత వరకూ పంటను కాపాడుకోవచ్చు...పిచికారీ అవసరమైనప్పుడు కూడా.. రసాయనిక పురుగు మందులు కాకుండా... యాప మందులు… మొక్కల కాషాయాలూ వాడాల
సాలమ్మ: అట్టాగే నరిసిమ్మావా..ఈ పాలి మా పొలాన్నీ, పంటలను కూడా ..మా పిల్లల్లాగే ..సక్కగ..సాక్కుంటాలే...కానీ నరిసిమ్మావా..ఎంకటేశుని చూసి మా ఇంటాయన కూడా పత్తి, మిరప పెట్టాలని చూస్తున్నాడు...మనకీ ఆడపిల్లలున్నారు..మనమూ ఆళ్ళ పెళ్ళిళ్ళు ఘనంగా చెయ్యాలని ఒకటే ఇదైపోతున్నాడు..
నరసింహం: కూతుళ్ళకి ఘనంగా పెళ్లి చెయ్యాలన్నఆశ తండ్రికి ఆమాత్రం ఉండదేటి?.. కానీ ఆ ఆశే ..నిరాశగా మారితే .. కట్టం కదా..
సాలమ్మ: మరి నేను పత్తి జోలికి పోవద్దయ్యా అంటే ఇంటాడో లేదో...
నరసమ్మ: ఈ మొగాళ్ళ మాట ఇంటూ కూర్చుంటే అయినట్టే. ముందంతా ..నీకేం తెల్దు...నీకేం తెల్దంటూ...ఎవసాయం అని, యాపారం అని ఉన్నదంతా తగలేసి ...ఆ తర్వాత యాదో ఒకటి సేసుకోవడం.. ఆడికేదైనా అయితే అయితే ఆ ఉన్న అండ కూడా పోయి ఎటూ కాని పిల్లలతో అప్పుడు ఈ ఆడోల్లే అవస్థ పడాల..
సాలమ్మ: హమ్మో ఇనదానికే భయమేస్తావుందత్తా ...
నరసింహం:..ఇదిగో మీరిట్టా .. బయపడతారనే..ఆళ్ళు మీకు ఏ సంగతీ చెప్పరు..
నరసమ్మ: ఆ..ఆ… ఏమీ సెప్పా పెట్టకుండా… సేస్తే మాత్రం బాగుంటాదా అని ..
నరసింహం: అదేందే ..ఉరుమురిమి మంగలం మీద పడినట్టు..అది ఆడి గురించి సెప్తే.. నువ్వు అందరినీ అంటుడావు. నీతో సెప్పకుండా నేనేదైనా సేశానేటి. ఇంట్లో అందరితో మాటాడి, ముక్కెంగా ఆడోల్లతో అది ఇట్టా, ఇది ఇట్టా అని అనుకోని సేసినప్పుడే మంచిగుంటాది.
సాలమ్మ: మంచి మాట సెప్పినావ్ మామా … ఇక నే పొయ్యొస్తా ..నరసమ్మత్తా. వస్తా…
నరసమ్మ: ఉండు సాలమ్మా..మా ఊరు నుంచి కూరగాయల విత్తనాలు తెచ్చినా.
సాలమ్మ: అట్టాగా..ఊర్లో అంతా బాగుండారా
నరసమ్మ: ఏం బాగులే సాలమ్మా .. ఆమద్దెనొచ్చిన వచ్చిన వరదలకి మావోల్లంతా బాగా దెబ్బతిన్నారు...ఎవసాయం ఎర్రోని చేతిలో రాయిలాగైపోయినాది….ఎటుపోతుందో తెలియదు .. ఏమైతాదో తెలియదు …అతివృష్టి ..అనావృష్టి.....అనావృష్టికైనా ..ఉపాయాలున్నాయేమో కానీ ..ఈ అతివృష్టి తో అంతా ..తుడిచిపెట్టుకుపోయినాది … ...ఆల్లకేదో ధైర్యం సెప్పాను కానీ ...ఆళ్ళ పరిస్థితి తల్సుకుంటే నాకే గుబులుగా ఉంది...
సాలమ్మ: ఊరుకో నరసమ్మత్తా ...అంతా సర్దుకుంటాదిలే.. ఇది.. .మీ వోల్లొక్కరికే వచ్చిన పరిస్థితి కాదు....శానామంది పరిస్థితి ఇట్టానే ఉంది… యాదో విధంగా ప్రభుత్వం ఆదుకుంటాదిలే
నరసమ్మ: మారాజుల్లాగా ఉండే టోళ్ళు ...మా రైతులే రాజులం ...మాకు కొలువు లెందుకనేవోళ్ళం... దేనికీ ఎవురినీ దేబిరించే పనే లేకపాయే..ఇత్తనాలు మనవే..పాడి మస్తుగుండె ..ఎరువుకి ఇబ్బందనేదే లేకపాయే..ఒక పాడేనా..కోళ్ళు, మేకలు, .ఒకతనేమి లేదు..అన్నీ మనవేనాయె… ఇప్పుడు రోజులే మారిపోయినాయ్..
నరసింహం: రోజులంటా వేటి.…కాలాలే మారిపోతే..అప్పుట్లో ఏ కాలానికి ఆ కాలం ఉండేది.ఏ కాలంలో పెట్టే పంటలు అప్పటియి. ఇప్పుడో .. అన్ని కాలాలూ.. కల్సిపోయినాయ్
నరసమ్మ: వానలెప్పుడుస్తాయో తెలవదు.. పంట ఎప్పుడు పెట్టాలో తెలవదు.. ఎట్టాగో పంట పండిచ్చినా, పంట కోతకోచ్చేతాలికి వానలు కుమ్మరిస్తుండాయ్… ఏందో కలికాలం. ఈ కష్టాలన్నీ మనకే వస్తుండాయ్
నరసింహం: ఇది ఇప్పుడు మన ఒక్కరికే వచ్చిన కట్టం కాదే. దేశం మొత్తం మీద పరిస్థితి ఇట్టాగే ఉంది…ఒక్క మనదేశంలోనే కాదు..అన్ని దేశాలలో ప్రజలూ ఇట్టాంటి వరదల వలన, కరువుల వలన అనేక రకాల క ట్టాల పాలౌతున్నారు...మనుషులే కాదు…ఈ వాతావరణంలో వచ్చే పెద్ద పెద్ద మార్పులకు కొన్ని జాతుల మొక్కలూ, జంతువులూ కూడా కానరాకుండా పోతున్నాయ్
సాలమ్మ: అట్టాగా...ఈ ఇపరీతమైన ఎండలకీ ..వానలకీ మడుసులే బతకట్లేదు…ఇంక మొక్కలేం బతుకుతాయ్ ..
నరసింహం: అందుకే మనం ఇట్టాంటి ఇపత్తులను ఎదుర్కోడానికి సిద్ధంగా ఉండాల...జీవిత భీమాలు, పంట భీమాలు సేయించుకోవాల, దిగుబడి బాగా వచ్చినప్పుడు మంచి ధర చూసి అమ్ముకోవాల ...సరుకు పాడవకుండా ...మంచి గిడ్డంగులను అందురూ కలిసి ఏర్పాటు చేసుకోవాల…
నరసమ్మ: ముఖ్యంగా లాభాలొచ్చినప్పుడు ఆ డబ్బును అవసరానికి అందివచ్చేలాగా జాగ్రత్త చేసుకోవాల… మళ్ళీ పంట ఏసుకోవటానికి పైసలుంటాయ్ ...ఎట్టైనా నేలను నమ్ముకున్నోల్లమైతిమి… మల్ల మల్ల పంటలు పెడ్తుండాల ..మంచి దిగుబడి తెచ్చుకోవాల..
నరసింహం:... అద్గదీ యాది పోయినా ..మనం ధైర్యాన్ని మాత్రం అస్సలు పోగొట్టుకోకూడదు… అయినా కష్టాలు లేనిదెవరికీ.. ఎన్ని కష్టాలుండా నిబ్బరంగా ఎదుర్కోని పోరాడాల ..అప్పుడే మనకు మంచి జరుగుతాది.
చంద్రయ్య: తధాస్తూ…బాబాయ్ ఇలాగే ఎప్పుడూ మంచే జరగాలనీ, జరుగుతుందనీ మనం అనుకుంటూ ఉండాల. ఎందుకంటే మన ఆలోచనల బట్టే మన మాటలు, మన మాటల్ని బట్టే చేతలూ ...
సాలమ్మ: చేతలని బట్టే రాతలూ …
చంద్రయ్య: అదీ.. బాగా సెప్పావ్ సాలమ్మా
నరసమ్మ: ఈ చంద్రయ్య వచ్చినాడంటే యాడాడి ముచ్చట్లూ సెప్తాడు ...చంద్రయ్యా నీ ముచ్చట్లిని చాల దినాలాయె ...ఏందీ ఈ మద్దిన అగుపడట్లేదూ..పట్నం పోయా?
చంద్రయ్య: ఏం పిన్నీ ...ఎప్పుడూ పట్నాలేనా ..మన పల్లెల్లో కూడా ..తెలుసుకోవలసిన విశేషాలు శానా ఉండాయ్
నరసింహం: యాడికి పోయినావేంటి..
చంద్రయ్య: వరంగల్లు జిల్లాలో జనగాం కాడ.. పల్లెటూళ్ళన్నీ చూసొచ్చినా .ఆడ చాలా మంది రైతులు శ్రీ వరి పద్ధతిలో వరి ఎంత బాగా సాగు చేస్తుండారనుకుండావ్..సుగుణమ్మని .. శ్రీ వరి సాగు మంచిగ చేస్తోందని చెప్పుకుంటుంటే...నేనూ పోయి ఆ ముచ్చట్లన్నీ రాసుకోనొచ్చా..
నరసింహం: అట్టనా
చంద్రయ్య: ఆమె మామూలుగాన్నా కూడా తక్కువ నీరు వాడినాదంట. అయినా .. .దిగుబడి తగ్గలేదు సరి కదా… దిగిబడి మామూలు కన్నా ఎక్కువే వచ్చినాదంట.. అందురూ మెచ్చుకుంటుండారు
నరసమ్మ: మరి ఆడ కూతురు అంత మంచిగ చేస్తే మెచ్చుకోరూ…
చంద్రయ్య: ఆమె అమెరికా కూడా పోయోచ్చినాదంట
సాలమ్మ: అట్టాగా..అదురుష్టమే!
చంద్రయ్య: నిజమే సాలమ్మా ..మనకిట్ట అయ్యిందే ..ఎట్టాగా..అని దిగులు పడకుండా...కష్టపడతా ఉంటే ...ఏదో ఒక రోజు...ఏదో రూపంలో.. అదృష్టం కలిసోస్తాది.. . ఆ నోటా ..ఈ..నోటా మన గురించి ఇన్నోళ్ళు..మన సరుకు కొనడానికి రావచ్చు..లేదా..ఇంకేదైనా మంచి జరగచ్చు..
చంద్రయ్య: ఇట్టాంటి మంచి విషయాలు, కొత్త విషయాలూ తెలుసుకుంటూ ఉండాలి సాలమ్మా...అట్టాంటియన్నీ ..ఇంటా ఉంటే ...ఆళ్ళు చేశారు మనమూ చెయ్యగలమూ..అని నమ్మకం వస్తాది..
సాలమ్మ: అంతేలే
చంద్రయ్య: మనకు సమస్య ఏదైనా వస్తే ...ఇట్టాంటి సమస్య వచ్చినప్పుడు ..వాల్లిట్టా చేశారు.. మరి..నేను ఎం చెయ్యాల అని యోచన చేసుకోవాల. ఒక్కోసారి పెద్ద సమస్యకు కూడా.. చిన్న చిన్న ఉపాయాలు ఉంటాయి.. నువ్వే ప్రయత్నం చేసి చూడాల
సాలమ్మ: నేనా?!
చంద్రయ్య: ఇప్పుడు పెద్దగా సదువు కోపోయినా ..పల్లెల్లోవోళ్ళు..కూడా..ఎన్నో విషయాలు కనిపెడుతున్నారు..అవసరం మడిసికి ఎన్నో నేర్పిస్తాది.. నీకు ఏది అవసరమో నీకే బాగా తెలుస్తాది..
సాలమ్మ: అంతే గదూ
చంద్రయ్య: మరి ఒకవేళ నువ్వు ఏదైనా .కనిపెట్టావనుకో..ఆహా..అనుకో...చిన్నదైనా..మా పొలంలో ఫలానా పురుగోచ్చినాది..ఫలానా ..ఆకు కషాయం ..మంచిగా పని చేసినాది..ఆ విషయం ..నువ్వు మొహమాటం లేకుండా..నలుగురికీ చెప్పచ్చు..
నరసమ్మ: నాలుగ్గోడల మద్దా ఉండేది..ఇది నలుగురికీ ఎట్టా సేప్తాది..
చంద్రయ్య: మనసుంటే మార్గమదే ఉంటాది..కొద్దో ..గొప్పో సదువుకుందికదా .. అది దాని పొలంలో తెలుసుకున్న విషయాలు ఒక పుస్తకంలో రాసి పెట్టుకోవచ్చు.. ఈ రోజే డైరీలోనో లేదా పుస్తకంలోనో రాసుకోవచ్చు..
నరసింహం: మనూర్లో ఏ మీటింగులప్పుడో .. అందరూ.. ..వచ్చినప్పుడు .. కలిసినప్పుడు ..వాటి గురించి మాట్లాడుకోవచ్చు..
చంద్రయ్య: ఇప్పుడు కంప్యూటర్లు కూడా వచ్చినాయ్ గా బాబాయ్ ..ఎక్కడెక్కడ వాళ్ళూ ..వాళ్ళ ..వాళ్ళ ..అనుభవాలు ఎందరితోనో పంచుకోవచ్చు.. మనం ఏ పనైనా..ఆ..ఇదేం జరుగుద్దిలే అని వదిలెయ కూడదు బాబాయ్..ఇది..జరగాల..దానికి.. నేనేం చెయ్యాల..అని ఆలోచించాల
నరసింహం: ఈ ముచ్చట్లు..సెప్పుకోడానికి బాగుంటాయి కానీ ...సెయ్యాలంటేనే ఇబ్బంది...అయినా ఇట్టాంటియన్నీ గోరంతలు ..కొండంతలు ..చేస్తారులే చంద్రయ్యా…
చంద్రయ్య: మంచి విషయాలు గోరంతలు కొండంత చేసినా మంచిదే బాబాయ్ ...కానీ ఇదిగో పులి..అంటే ..అదిగో తోక… అనే చెడ్డ మాటలే ...రైతులను మరింత దిగతీసేది..ఆశ ఉండాలి బాబాయ్ ...ఆ ఆశే మనిషిని బతికిస్తుంది..
సాలమ్మ: నిజమే చంద్రయ్యా ..ఆశే మడిషిని బతికిస్తుంది…మన సమస్యలే మనకు పాఠాలు నే ర్పిత్తాయ్
నరసింహం: మొత్తానికి రెండువేల పది మనకు పాఠాలూ, గుణపాఠాలూ సాలానే నేర్పినాది...ఇక రాబోయే సంవచ్చరం మనందరకూ బాగుండాల..
నరసమ్మ: కొత్త సంవత్సరం మనందరం బాగుండాల. పాడీ, పంటా మంచిగుండాల ..
చంద్రయ్య: అందరికీ తిండి పెట్టే అన్నదాతులు సంతోషంగా ఉన్నప్పుడే లోకానికంతా సంతోషం
సాలమ్మ: మనందరం ..ఇట్టా ధైర్నేంగా ..ముందుకు పోతుంటే ..ముందున్న కాలమంతా మంచిదే ..
No comments:
Post a Comment