Sunday, December 26, 2010

పువ్వు ..పువ్వు ..ఏమి పువ్వు ..


అంకం 1
సిరి: అమ్మా.... అమ్మా....
విజయ: ఎంటమ్మా
సిరి: అమ్మా ...నిద్రొస్తోంది
విజయ: వెళ్ళి పడుకోమ్మా ..మా బంగారు కొండ కదూ ...
సిరి: మరైతే ... ఆ బంగారు కొండ పాట పాడాలి ..
విజయ: మరి నువ్వు ఆ పాట వింటూ పడుకోవాలి సరేనా ..
పువ్వు పువ్వు - ఏమి పువ్వు
మల్లె పువ్వు - ఏమి మల్లె
కొండ మల్లె - ఏమి కొండ
సిరి :బంగారు కొండ ..
ఇద్దరూ (సిరి-విజయ) : మా పాప .. బంగారు కొండ
సిరి:అమ్మా అంత్యాక్షరి ఆడదాం ..
విజయ: ఈ సారి సినిమా పాటలతో కాదు వెరైటీగా పువ్వుల పేర్లతో ఆడదాం . ఈ పాటలో మల్లె ఉంది కదా ...ఇప్పుడునువ్వు చెప్పు .
సిరి: మల్లె ..ల ..లోటస్..
విజయ:లోటస్ ..ఇది ఇంగ్లీష్ పేరుకదా ! సరేలే ఇప్పుడు స ..కదా ..సంపంగి
సిరి:గ ..గులాబీ ..
విజయ: బ ..బంతి ..
సిరి: తీ..త ..ఊ...ఈ ఆట వద్దు. నాకు రావట్లేదు
విజయ: సరే అయితే ఏదో ఒక పువ్వు పేరు చెప్పు
సిరి :సన్ ఫ్లవర్ ..అమ్మా తెలుగులో సన్ ఫ్లవర్ ని ఏమంటారు ?
విజయ :సన్ ఫ్లవర్ ని తెలుగులో పొద్దు తిరుగుడు అంటారు .దీని గింజల నుంచి నూనె తీస్తారు .
సిరి: అమ్మా .. ఇప్పుడు నువ్వు చెప్పాలి . నేను సన్ ఫ్లవర్ చెప్పాను
విజయ : ఇప్పుడు నేను చెప్పాలా సరే.. సాఫ్లవర్...
సిరి: అంటే
విజయ: కుసుమ
సిరి: అంటే
విజయ: అంటే... ఇది కూడా సన్ ఫ్లవర్ లాగే ఒక నూనె గింజల పంట. అప్పుడు తాతయ్యకు మంచిదని డాక్టర్ చెప్పారే అది. సరే ఇంక పడుకో ..కుసుమ గురించి తరువాత చెప్పుకుందాం .. .

అంకం 2 పేదరాసి పెద్దమ్మ కుంకుమెండబోసే...


విజయ: ఎవరూ?!..
హాయ్ రమ్యా ! ఎన్నాళ్లైంది నువ్వు మా ఇంటికి వచ్చి.రా..రా ..
రమ్య: ఇక్కడికి దగ్గరలో డాక్టరును కలవాలని వచ్చాను. ఈ మధ్య కొద్దిగా మెడ మీద ఎలర్జీ లాగ వచ్చింది. సరే ఓ అరగంట టైం ఉంది కదా అని వచ్చాను
విజయ: రా..కూర్చో ..ఈ ఫోటోలు చూస్తూ ఉండు . ఇప్పుడే ఒక్క క్షణంలో వస్తా

sound - pouring of tea
రమ్య:విజయా చాల బావున్నాయి ఫోటోలు. మీ అమ్మాయి డ్రెస్ రంగు భలే బాగుంది . అన్నయ్యగారు వేసుకున్న డ్రస్ కూడా చాలా బాగుంది.
విజయ:అదంతా కుసుమ మహిమ. ఇంద టీ తీసుకో ....
రమ్య: నువ్వు కూడా మునుపటి గన్నా చెలాకీగా కనిపిస్తున్నావు ..
విజయ: అది కూడా కుసుమ మహిమే ..
రమ్య:ఈ టీ ఏంటి ఏదో కొత్త రకంగా ఉంది. ఫారిన్ దా
విజయ: సీమ సరుకు కాదు మన సరుకే ...
రమ్య:టీ బంతిపూ రంగులో చాలా అందంగా ఉంది .అందులోనూ ఈ తెల్లటి కప్పులో మరింత ఆకర్షణీయంగా ఉంది.
విజయ: కప్పులకి కూడా అందం ,ఆకర్షణ ఏమిటి ?

రమ్య: అందాన్ని తక్కువ అంచనా వెయ్యకోయ్ మన కళ్ళు కూడా తినడంలో ముఖ్య పాత్ర వహిస్తాయి. మనం ఇష్టంగా , ప్రీతిగా , ప్రశాంతంగా తిన్నదే వంటపడుతుందని మా అమ్మమ్మ అనేది .
విజయ:మరి అలాగైతే ఇది కూడా చూడు.
రమ్య:ఓ స్వీటా..చాలా అందంగా ఆకర్షణీయంగా అమర్చావు . నీకు కళాషోషణ బాగా అబ్బిందే. కానీ ఈ మధ్యన డాక్టర్లు ఎలాంటి రంగులు వాడద్దంటున్నారు
కదా!
విజయ:అవుననుకో ,కానీ అస్సలు రంగు వెయ్యక పొతే పిల్లలు చూడగానే మా కొద్దు అనేస్తారు . కృత్రిమ రంగులైతే మంచిది కాదు . కానీ ఈ కుసుమ
రంగు సహజమైనదే కదా.
రమ్య: ఏమిటి తల్లీ, వచ్చిన దగ్గర నుండీ ఈ కుసుమ జపం మొదలుపెట్టావు! సరే ఇంక నేను వెళ్లొస్తాను.
విజయ: ఒక్క క్షణం ఆగవే ఇప్పుడే వస్తున్నాను.

రమ్య: ఇప్పుడెందుకే ఇవన్నీ
విజయ: మొన్న మా అమ్మాయి పుట్టిన రోజుకి నువ్వు రాలేదుగా. వచ్చిన వాళ్ళందరికీ ఈ జుబ్బాలు పెట్టాము. పుట్టిన రోజుకి వచ్చిన వాళ్లకి జాకెట్టు బట్టో, చీరో కాకుండా ఇదేంటి అనుకుంటున్నావా. ఇవి కుసుమ నుంచి తీసిన రంగుతో డై చేయబడ్డాయి. ఈ బట్ట రాత్రి పూట ధరించే దుస్తులకీ, దుప్పటీలకీ, గలీబులకీ కూడా మంచిది. ఎందుకంటే ఇది ...
రమ్య: సహజమైంది కదా ... మళ్ళీ ఈ చిన్న పాకెట్ ఏమిటి?
విజయ: అవి కుసుమ విత్తనాలు. మీ పెరట్లో చల్లేయ్. మీ పెళ్లి రోజు నాటికి పూలు పూస్తాయి.
రమ్య: మంచిది. మరి మా పెళ్లి రోజుకి నువ్వు తప్పకుండా రావాలి సుమా. సరే మరి నే వస్తానూ..


అంకం 3

విజయ: రమ్యా ..రమ్యా ..పెళ్లిరోజు శుభాకాంక్షలు. అన్నయ్యగారేరి?
రమ్య: ఇప్పుడే అలా బయటకు వెళ్ళారు.
విజయ: అయ్యో ఇంకా ముందే రావలసింది. సరైన టైంకి రాలేకపోయాను.
రమ్య: నువ్వు రాలేకపోయినా నువ్విచ్చిన కుసుమ పూలు సరైన సమయానికే వచ్చాయి. ఈ బోకే చూడు. స్నేహ తయారు చేసింది. కుసుమ పూలతో..
విజయ: అవునా! చాలా బాగా చేసింది. పసుపు, ఎరుపు, తెలుపు, నారింజ రంగు పూలతో అందంగా ఉంది. ఇలా రకరకాల రంగుల పూలు రావాలనే నీకు నాలుగైదు కుసుమ రకాల విత్తనాలు కలగలిపి ఇచ్చాను.
రమ్య: అవును విజయా, మీ అన్నయ్య గారికి కూడా చాలా నచ్చింది. ఇంత బాగుంటే మా ఆఫీసులో కూడా పెట్టుకోవచ్చు కదా అన్నారు. ఇవి ఎక్కడ ఆర్డర్ చెయ్యాలి అని అడిగారు కూడా.
విజయ: ఎక్కడో ఎందుకు. మీ పొలంలోనే వేసుకోవచ్చు.
రమ్య: మా పొలం లోనా. అక్కడంతా వర్షాలు లేక ఏమీ
పండటం లేదు.
మా భూములు కౌలుకి తీసుకున్న వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. పట్నంలో ఏదైనా ఉద్యోగం చూపిస్తే వచ్చేస్తామంటున్నారు.
విజయ: ఈ కుసుమ పంట విశేషమేమిటో తెలుసా రమ్యా! ఇది వర్షాభావ పరిస్థితులలో కూడా బాగా వస్తుంది. నువ్వు మీ రైతులతో ఈ పంట పండించి, ఆ పూలను మీరు కొంటే వారిని ఆదుకున్నట్లు ఉంటుంది. బోకేల రూపంలో నలుగురికీ పంపిస్తే కట్ ఫ్లవర్ గా కుసుమ ప్రాచుర్యం పొందే అవకాశం ఉంది. అలాగే కనుక జరిగితే ఆ ప్రాంతంలోని ఎన్నో కుటుంబాలకు ఉపాధి చూపించిన వారౌతారు.
రమ్య: మరి ఇది సీజనల్ వ్యాపారం కదా. దీన్ని నమ్ముకుని వాళ్ళు ఆ ఊరిలోనే ఎలా ఉండి పోతారు?
విజయ: అలాగని అందరూ పల్లెటూళ్ళు వదిలి పెట్టి వచ్చేస్తే ఎలాగా? అక్కడే వారికి మంచి ఉపాధి చూపించే బాధ్యత పట్నం వారికి కూడా ఉంది. ఇప్పుడందరూ కార్పోరేట్ సామాజిక బాధ్యత అంటున్నారు కదా! అందులో భాగంగా ఆఫీసుల్లోనూ, ఇంట్లో జరిగే ఫంక్షన్స్ లోనూ అలంకరణకి ఈ కుసుమ పూలు వాడుకోవచ్చు. ఈ పూలు ఎక్కువ సేపు తాజాగా ఉండడమే కాకుండా డ్రై ఫ్లవర్ గా కూడా తయారు చేయ వచ్చు. దానికి సీజన్ లేదు కదా!
రమ్య: కానీ అంత ఉపయోగం కూడా లేదు కదా!
విజయ: నిజమే! డ్రై ఫ్లవర్స్ అందరూ విరివిగా వాడరన్నది వాస్తవమే. అయితే మనం నిత్యం ఉపయోగించే విజిటింగ్ కార్డులకూ, పుస్తకాలకీ, ఇంకా అలాంటి ఇతర ఉపయోగాలకీ కుసుమ కాండాల నుంచి తయారు చేసే కాగితాన్ని ఉపయోగించ వచ్చు. ఆ కాగితం తయారు చేసే గుజ్జులో కుసుమ పూరేకులు వేస్తె అందంగా కూడా ఉంటుంది.
రమ్య: అవునులే. మనసుంటే మార్గాలెన్నో ...మనం పట్టుదలతో పట్టించు కోవాలి కానీ..
విజయ: బాగా చెప్పావు రమ్యా. ఇది మనం పట్టుదలతో సాధించ వలసిన విషయమే. ఎందుకంటే కుసుమ పంట గురించి జరిగే ప్రతి చిన్న అభివృధ్ధీ కరువు ప్రాంతాలలోని రైతులను ఆదుకుంటుంది.



అంకం 4


శ్రీరాం: చెల్లాయ్, మొన్న నువ్వేదో టీ ఇచ్చావుట. ఆరోగ్యానికి చాలా మంచిదట. అదేదో కాస్త మా రమ్యకి కూడా చెప్పు.
విజయ: ఇందులో రహస్యమేమీ లేదు అన్నయ్యగారూ, ఆరోజుల్లో చాలామంది ఉదయం పూట, ఇంకా భోజనం తరువాత గ్రీన్ టీ అని చెప్పి తీసుకుంటున్నారు కదా. సాధారణంగా ఇందులో తేనె, నిమ్మకాయ, అల్లం, తేయాకులు ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఒక్క తేయాకులే కాకుండా ఇంకా ఇతర ఆకులు, బెరల్లతో కూడా ఈ టీ ని తయారు చేస్తారు. మల్లె ఆకులతో, పువ్వులతో కూడా టీ చేస్తారంటే నమ్మండి. అలాగే కుసుమ పూరేకులతో కూడా టీ తయారు చేసుకోవచ్చు.
రమ్య: ఈ కుసుమ టీ గుండెకు కూడా మేలు చేస్తుందిటండీ. కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుందిట. ఆస్థ్మా వాళ్ళకీ, కీళ్ళ నొప్పుల వాళ్లకి కూడా ఈ టీ మంచిదట.

శ్రీరాం: ఇదేదో బాగానే ఉంది కదా. మన వాడొకడు అమెరికా నుంచి వచ్చేసి టీ బార్ పెట్టుకున్నాడు. ఈ కుసుమ టీ ని అందులో పెట్టిస్తే మంచి లాభసాటిగా ఉండచ్చు.
విజయ: అన్నయ్యగారూ ఈ కుసుమ పూరేకులను టీ బాగ్స్ లాగ కూడా చేసి సూపర్ మార్కెట్లలో అమ్మకానికి పెట్టచ్చు. ఇది పూర్తిగా మహిళలే నిర్వహించి స్వాలంబన పొంద వచ్చు. మన ఊర్లో దీని గురించి ఒక శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తే ఎలా వుంటుందంటారు?
శ్రీరాం: బానే ఉంటుంది. చేసి చూద్దాం. మంచి పనేగా...
రమ్య: మరైతే ఆలస్యం ఎందుకు? శుభస్య శీఘ్రం!

అంకం 5

అంజయ్య: రాఘవయ్యా బాగున్నావా? ఈ మధ్యన చేను కాడ కనిపించకపోతేనూ ఓ పాలి చూసెల్దామని వచ్చా.

రాఘవయ్య: నేనే నీ కాడికి ఓ సారొద్దామనుకుంటున్నా అంజయ్యా. అంతా బాగుండారా?
అంజయ్య: ఆ.. అంతా బాగానే ఉండారు. అవునూ ఈ పాలి నువ్వు ధనియాలు వెయ్యలేదా? ఏదో కొత్త మొక్కలు కనిపిస్తున్నాయి చేలో!
రాఘవయ్య: అయ్యా! ఏదో మీ పెద్దమ్మ ఎద్దామంటే, సరే .. సూద్దాంలే అని యేశాను. ఏదో కుసుమంట. మన పొద్దు తిరుగుడు లాగే అదో నూనె గింజల పంట. మొన్న పట్నం నుండి మన విజయమ్మ ఆ ఇత్తనాలు ఇచ్చి పోయింది. దసరా అప్పుడు, అంటే సెప్టెంబర్, అక్టోబర్ అప్పుడు ఇత్తితే శివరాత్రి వరకు, అంటే ఫిబ్రవరి మార్చిలో పంట చేతికొస్తదంట. అంతగా నీరు పెట్టే పనీ లేదు. పురుగు మందులు చల్లే పనీ లేదు. వర్షాలు బాగా పడినట్లయితే నీరు పెట్టే అవసరమే లేదు.
అంజయ్య: మరి అంత మంచి పంటైతే అందరూ ఏసేయచ్చు కదా!
రాఘవయ్య: అవుననుకో. అయితే ఒకటుండాది. ఈ మొక్కకు ముళ్లుంటాయి. అందుకని కొత్తవారు ఈ పంటను వెయ్యడానికి ఇష్ట పడరు. ఇప్పుడు ముళ్ళు లేని రకాలు కూడా వస్తున్నాయంట. అయితే ఇంకా చాలా మందికి కుసుమ పంట గురించి, ఆ ముళ్ళు లేని రకాల గురించి తెలియదు.
అంజయ్య: మరి ఇప్పుడు మనం ఈ పంట పండిస్తే కొనే వారుంటారా?
రాఘవయ్య: ముందు మనం వేసి చూద్దాం. మనం పండించినంత వరకూ మనమే పట్నం తీసుకుని పోయి అమ్మవచ్చు. ఇది ఆకుకూరగా కూడా పని చేస్తుందంట. నువ్వూ వేసి చూడు.
అంజయ్య: సరే, ఆనాక లచ్చమ్మని అంపిస్తా ..విత్తనాల కొరకు.

అంకం 6 ఆకేసి..పప్పేసి..బువ్వేసి..నెయ్యేసి..

లచ్చమ్మ: ఎల్లమ్మత్తా...ఎల్లమ్మత్తా...
ఎల్లమ్మ: ఎవరూ .. లచ్చమ్మా ..రా ..రా...
లచ్చమ్మ: భోజనాలైనాయా ...ఈరోజు ఏం కూరేంటి?
ఎల్లమ్మ: అవుతున్నాయి కానీ, ఇదుగో ఇది కొంచొం నోట్లో ఏసుకో . యా కూరో ..నువ్వే చెప్పుకో!

లచ్చమ్మ: ఇదేం కూరబ్బా, పూండి కూరా...అబ్బే జిగురు లేదే ...దొగ్గలి కూరా?! ఏమో అత్తా నువ్వే చెప్పు. సరే కానీ, ఏవో కొత్తరకం ఇత్తనాలంట. మా ఇంటాయన నీ కాడ్నుంచి తెమ్మన్నాడు.
ఎల్లమ్మ: ఇంతకీ ఈ కూర ఏందో తెలియలేదా! నువ్వడిగావే, ఆ కుసుమ కూరే ఇది. లేత మొక్కలను పప్పులో ఏసుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు. కూరగా కూడా వండుకోవచ్చు.
లచ్చమ్మ: బాగుంటుందా?
ఎల్లమ్మ: అలవాటు లేనోల్లకి కొత్తగా ఉండచ్చు. ఏ పల్లీల పోడో, నూ పప్పో దంచి ఎస్టే అదే రుచిగా ఉంటుంది. అయినా ఏ ఆకు కూరైనా కంటికి, వంటికి మంచిదాయే, అందునా ఇది మరీ మంచిదంట. మనము మనకు నచ్చినట్టు వండుకుని తింటూ ఉంటే, నెమ్మదిగా పిల్లలకి కూడా అదే అలవాటు అవుతుంది.
ముందు మనమే ఛీ, ధూ, అంటే ఇంక పిల్లలేం తింటారు?
లచ్చమ్మ: సరే అత్తా. అట్టాగేలే. నువ్వు చేసిన కూర ఇయ్యి. నువ్వు చేసినావంటే పిల్లలు ఇష్టంగా తింటరు.
ఎల్లమ్మ:అట్టాగేలే...పొరుగింటి పుల్ల కూరని ఊరికే అన్నారా!



అంకం 7

చంద్రయ్య: అమ్మా, విజయమ్మా...విజయమ్మా...
విజయ: ఆ..చంద్రయ్యా.. బాగున్నావా? ఏంటి ఈ ఊరు ఎప్పుడొచ్చావు. రా..రా..
చంద్రయ్య: నిన్ననే వచ్చానమ్మా. మీరు పంపిన కుసుమ పూరేకులతో బట్టలు డై చేసి తీసుకుని వచ్చాను. ఇక్కడి సోసైటీలకీ, షాపులకీ, సాంపిళ్ళు ఇవ్వడానికి వచ్చానమ్మా. బానే పోతున్నాయి. అంతా తమరి దయ. ఇదుగోండమ్మా, ఈ చీర మీ కోసం మా రంగమ్మ స్వయంగా నేసింది.

విజయ: చాలా థాంక్స్ చంద్రయ్యా. మేము ఇలా చెప్తే అలా అల్లుకుపోయి ఇంతవరకూ ఎదిగారంటే దానికి మీ పట్టుదల, శ్రధ్దే కారణం. వీటిలో కొన్ని మా స్నేహితురాళ్ళ బాతిక్స్ లో పెట్టిస్తాను.
స్నేహ: అత్తా...అత్తా..
విజయ: ఓ స్నేహా..ఏంటీ విశేషం. ఏదో విశేషంగా తయారయ్యావు. చేతిలో ఆ కార్డెంటి?
స్నేహ: చూడండి. మీకే తెలుస్తుంది.
విజయ: పెళ్లి కార్డు.. చాలా అందంగా ఉంది. అక్కడక్కాడా ఎరుపు రంగు పూరేకులతో మంగళకరంగా ఉంది.
స్నేహ: అత్తా ఆ పూరేకుల్ని గుర్తు పట్టారా? మీరిచ్చిన కుసుమ మొక్క పూలు. మా స్నేహితురాలికి కాగితం తయారీ వచ్చు. తను తయారు చేసి ఇచ్చింది.
విజయ: చంద్రయ్యా నువ్వు తెచ్చిన చీరల్లో మంచి చీర తియ్యి. కాబోయే పెళ్లికూతురుకి పెట్టడానికి.
చంద్రయ్య: ఈ చెంగావి రంగు చీర అమ్మాయిగారికి ఎంతో బాగుంటుంది.
స్నేహ: అత్తా అయితే నా పెళ్ళికి ఇదే మొదటి బహుమతి.
విజయ: మంచిదే. ఈ చీరలు చంద్రయ్య ఇప్పుడే తెచ్చాడు. నీతోనే శుభారంభం!
స్నేహ: అత్తా పెళ్ళికి వచ్చిన వాళ్లకి ఈ చీరలు పెడ్తే బాగుంటుంది కదా. వీటికి ప్రాచుర్యం కల్పించినట్టూ ఉంటుంది. కదా!
విజయ, చంద్రయ్య:శుభం!!


అంకం 8

రాఘవయ్య: అంజయ్యా ! బాగుండావా? నిన్న విజయమ్మ ఫోను చేసింది. వాళ్ళ పట్నం వాళ్ళంతా మనూరు చూడ్డానికొస్తారంట. ఈ ఊరు, వ్యవసాయం ఇంకా మన కుసుమ పంట అన్నీ చూసి ఫోటోలు తీసుకుని పోతరంట. అన్నట్టు మీ తమ్ముడి వాటా ఖాళీగానే ఉంది గందా. ఓ పాలి శుబ్బరం చేయించు. కొంత మందిని ఆడికి పంపిస్తాను. మా ఇళ్ళలో మీ పట్నం వాళ్ళు ఎట్టా ఉంటారమ్మా, అంటే విజయమ్మ వినలేదు. మీతో ఉంటేనే మాకూ మీ పద్ధతులు, అలవాట్లూ తెలుస్తాయి అంది.

అంజయ్య: అంతేలే రాఘవయ్యా, పట్నం వాళ్లకి మన కష్టాలు కూడా తెలుస్తాయిలే. ఏమంటావ్?
రాఘవయ్య: వాళ్ళ కష్టాలు వాళ్ళవి. ఆ ఉరుకులు...పరుగులు..ఎం జీవితం..ఆ రోడ్లు..కాలుష్యం ..ఆ..కాలుష్యం అంటే గుర్తుకొచ్చింది. ఈ మధ్యన పట్నం వాళ్ళు, విదేశీయులు పాలు, తేనె, వనమూలికలు వంటి వాటితో చేసిన సబ్బులను ఉపయోగిస్తున్నారంట. ఈ సబ్బులకు మంచి గిరాకితో బాటు, మంచి ధర కూడా పలుకుతుందట. ఇంతకీ చెప్పొచ్చేదేమితంటే మన కుసుమతో కూడా అలాంటి సబ్బులు చేయవచ్చంట.


అంజయ్య: అన్నట్టూ రాఘవయ్యా ఆ కుసుమ పంటలో ఏదో తెగులొచ్చినాది.

రాఘవయ్య: విత్తన శుద్ది చేసావా. అదేదో జీవ నియంత్రణ మందంట. ఏందదీ,...ఆ.. ట్రైఖోడెర్మా విరిడీ. దానితో కూడా విత్తన శుద్ది చెయ్యాలంట.
అంజయ్య: అబ్బో రాఘవయ్యా...బాగానే చెప్పావే
రాఘవయ్య: ఏందనుకున్నావ్? నేను, మీ పెద్దమ్మ ఒప్పచేప్పుకుని మరీ నేర్చుకున్నాం. మన చుట్టు పక్కల గ్రామాలలో రైతులకి కుసుమ పంట సాగులో శిక్షణ మనమే ఇవ్వాలంట.

అంజయ్య: ఇంకా నయ్యం. చుట్టు పక్కల దేశాల వాళ్ళు వస్తారనలేదు.

రాఘవయ్య: ఏమో నీ నోటి వాక్యాన అలా కూడా అవుతుందేమో చూద్దాం. ఇప్పుడిప్పుడే కుసుమ గింజలలో మధుమేహానికి, గుండె జబ్బులకీ పనికి వచ్చే మందులు ఉత్పత్తి అయ్యేలాగ పరిశోధనలు జరుగుతున్నాయట. అప్పుడు మన దేశంలో కూడా కుసుమ పంటకు మహర్దశ పట్టవచ్చు. ఏమో!

కప్పలు అప్పాలైపోవచ్చు...అన్నం ..సున్నాలైపోవచ్చు.. ఏమో!గుర్రం ఎగరావచ్చు నువ్వే స్వారీ చేయ్యావచ్చు..

No comments:

Edutainment

Edutainment
Crossword puzzles for farmers