Wednesday, February 15, 2023

Chilly Flower & Snowdrop

"మీ ఆవకాయ్...మా ఐస్క్రీం..." అన్నట్టుంది వరస! "అమ్మా ఇవేంటి?!" వెంటనే గుర్తుపట్టినా, ఎప్పటిలాగే ఒకసారి చెక్ చేసి మరీ చెప్పాను. అలా చెప్పగలిగినందుకు ఎదో ఒకలాంటి అనందం! అవి చూసి సంభ్రమం పొందిన తన చైల్డ్ లైక్ మనసు చూసి మరింత అనందం!! అప్పుడెప్పుడో నేను చదువుకునే రోజుల్లో ఒక రైలు ప్రయాణంలో నా ముందు కూర్చున్న అమ్మాయి తో నా సంభాషణ గుర్తుకువచ్చింది. ఆ రోజు నా ముందు బెర్త్ లో కూర్చున్న అక్క చెల్లెళ్ళు నాకు ఇంకా బాగా గుర్తు. అందం, సంస్కారం, పెద్దింటి పిల్లలు అని వేరే చెప్పక్కరలేదు. పెద్దమ్మాయికి పెళ్ళై చిన్న పాప. చిన్నమ్మాయి అక్కకి సహాయంగా. పాపాయిని ఆడిస్తూ వెర్రిమొర్రి చేష్టలు చేస్తూ ఉన్న ఆ అద్భుతమైన ఆడపిల్లలు, పాపాయి పడుకోగానే మామూలుగా... కాదు, కాదు ఒకింత తాత్వికంగా కూడా కనిపించారు. నాకు ఆశ్చర్యం వేసింది. చొరవచేసి సూటిగా అడిగాను. "అందరూ పిల్లల్ని కంటారు. అందరూ ట్వింకిల్ ట్వింకిల్ రైంస్ చెప్తారు...మరి ఇందులో ఉన్న గొప్పతనం ఏమిటి" ఆ అమ్మాయి వెంటనే ముందుకి వంగి ఎంత బాగా చెప్పిందో...బాగా అని ఎందుకు అన్నానంటే ఇంకో మంచి పదం దొరకక... చెప్పిన జవాబు సరే, చెప్పిన పధ్ధతి. ఆ తీరులో ఆమె ఆత్మ సౌందర్యం, సంపూర్ణత్వం గోచరించింది. "నిజమే! అందరు పిల్లలూ అవే మాటలు, మళ్లీ వాళ్ళ పిల్లలు...కొత్త ఏమీ ఉందదు. కానీ తేడా అల్లా మన పిల్లలు చెప్పినప్పుడు ఆ అనుభూతి వేరే! గమ్మత్తంతా ఆ మన లో ఉంటుంది!!" ఇప్పుడు నేను చెప్పగలను - ఆ 'మన' అన్న అనుభూతి. మన అన్న మమకారం లో తగులుకోక మనకు దక్కిన, దేవుడు ప్రసాదించిన వరాలను దైవప్రసాదంగా భావిస్తూ, ఆస్వాదిస్తూ జీవితాన్ని పండించుకోవడంతో బాటు ఆ 'మన' అన్న నిర్వచనాన్ని సాధ్యమైన మేరకు, సాధ్యమైన దిశలో విస్తృతం చేసుకుంటూ...

No comments:

Edutainment

Edutainment
Crossword puzzles for farmers